‘ గ్రేటర్ ‘ గేలం : రారండోయ్ టీఆర్ఎస్ అంతు చూద్దాం  ?

-

తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఎన్నికలు అధికార పార్టీ టిఆర్ఎస్ కు చుక్కలు కనబడేలా చేస్తుంది. ప్రతిపక్షాల కంటే ఇక్కడ టిఆర్ఎస్ కు గెలుపు ప్రతిష్ఠాత్మకం కావడం, ఇది ప్రభుత్వ పాలన పై రెఫరెండం గా భావిస్తుండటం వంటి కారణాలతో, ఎన్నికలను ఆ పార్టీ చాలా సీరియస్ గానే తీసుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలు హోరాహోరీగా జరగబోవడం తో, టీఆర్ఎస్ వైపు గెలుపు ఉంటుందా లేక ఆ సీటును బిజెపి వైపు ఉంటుందా  అనేది టెన్షన్ గానే ఉంది. ఈ సమయంలో గ్రేటర్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు టిఆర్ఎస్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. గెలుపు పై నమ్మకం లేకపోవడంతో, ఎన్నికలను వాయిదా వేయాలని టిఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది. ఇదిలా ఉంటే, బీజేపీ మాత్రం క్రమ క్రమంగా బలం పెంచుకుంటూ, తెలంగాణలో అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తోంది.
ఇటీవల హైదరాబాద్ ను ముంచెత్తుతున్న భారీ వరదల కారణంగా,  ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఆ ప్రభావం మొత్తం అధికార పార్టీకి వ్యతిరేకంగా మారడం బీజేపీకి బాగా కలిసి వస్తోంది. అందుకే జిహెచ్ఎంసి ఎన్నికలపై గట్టిగా దృష్టి పెట్టింది. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తి నాయకులను గుర్తించి, తమ వైపుకు తిప్పుకునేందుకు బిజెపి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా హైదరాబాద్ మాజీ మేయర్ మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ని బిజెపిలో చేర్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ లో చేరడం, ఆమె మంత్రి అవ్వడం, యాక్టివ్ గా ఉండటం తో తీగల కృష్ణారెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. దీంతో ఆయనను బిజెపిలో చేర్చుకుని మేయర్ అభ్యర్థిత్వం కట్టబెట్టేందుకు సైతం బిజెపి రాయబారాలు పంపుతున్నట్లు సమాచారం. వీరే కాకుండా, టిఆర్ఎస్ లోని మిగతా అసంతృప్తి నేతలను గుర్తించే పనిలో ఉంది.
మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేటర్లు, మాజీ మంత్రులు ఇలా చాలా మంది పైన బిజెపి దృష్టిసారించింది. వీరందర్నీ పార్టీలో చేర్చుకోవడం ద్వారా, బిజెపి మరింత బలపడుతుందని, టీఆర్ఎస్ పై వ్యతిరేకత జనాల్లో ఎలాగూ వుంది కాబట్టి, తప్పనిసరిగా గ్రేటర్ లో బీజేపీకే అవకాశం దక్కుతుందని, ఆ పార్టీ గట్టిగా నమ్మకం పెట్టుకుంది. పెద్ద ఎత్తున నాయకులను చేర్చుకోవడం ద్వారా టిఆర్ఎస్ ను బలహీనం చేయడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీని కోసం తమకు దొరికిన ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా వాడుకునే పనిలో బిజెపి బిజీగా ఉంది. టిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ లో కీలకమైన నాయకులనూ ఆకర్షించే పనిలో బిజేపి నాయకులు నిమగ్నం అయ్యారు.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news