బీసీ నినాదంతో ప్రజల్లోకి బీజేపీ.. 40 సీట్లు ఆ సామాజిక వర్గానికే కేటాయించాలని నిర్ణయం

-

తెలంగాణలో ఎలాగైనా ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ స్థానాలు మినహా 88 నియోజకవర్గాల్లో 40 సీట్లను బీసీలకు కేటాయించాలని భావిస్తోంది. మరోవైపు  ‘అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యం బీజేపీతోనే మార్పు’ నినాదంతో మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది.

 119 స్థానాల్లో 12 ఎస్టీ, 19 ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు మినహాయిస్తే 88 జనరల్ స్థానాలు ఉంటాయి. ఇందులో 40 సీట్లను బీసీలకు కేటాయిస్తే.. బడుగు బహీనవర్గాల ఓటు బ్యాంకు పార్టీకి కలిసి వస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్‌లకు బీఆర్ఎస్ ఒక్క సీటు ఇవ్వలేదని విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారి ఓటు బ్యాంకును దక్కించుకోవాలనే ఉద్దేశంతో.. ఈ 40 సీట్లలో ఐదుకు పైగా సీట్లను ముదిరాజ్‌లకు ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే ముదిరాజ్‌కు చెందిన ఈటల రాజేందర్ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

తొలి అభ్యర్థుల జాబితాను బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే సిద్దం చేసింది. ఈ నెల 16 తరువాత 38 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించనుంది. ఇందులో బీసీలకు 9 నుంచి 10 సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news