తెలంగాణ రైతులకు శుభవార్త. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ అమలుపై సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే విధివిధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 15వ తేదీ లేదా 18వ తేదీన సమావేశం జరిగే అవకాశం ఉంది. రుణమాఫీ అమలుకు అవసరమైన ప్రభుత్వపరమైన నిర్ణయాలపై సమావేశంలో చర్చించి వెల్లడించనున్నట్లు సమాచారం.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిర్ణీత గడువులోగా రుణమాఫీని సీఎం రేవంత్ అత్యంత ప్రాధాన్యాంశంగా చేపట్టారు. పంట పండించే ప్రతి పేద రైతుకు లబ్ధి చేకూరేలా రుణమాఫీ ద్వారా చేయూత అందించేలా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకునేలా మార్గదర్శకాలు ఉండాలని భావిస్తున్నారు. రుణమాఫీ అమలుకు ఎన్ని నిధులు అవసరం.. అందుబాటులో ఉన్న వనరులు, నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్‌గా తీసుకోవాలి.. అర్హులైన రైతుల గుర్తింపునకు విధివిధానాలు ఎలా ఉండాలనే అంశంపై కసరత్తు మొదలుపెట్టింది.