తెలంగాణ మంత్రివర్గ సహచరులకు శాఖల కేటాయింపు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు శాఖలను ఇంకా ఖాళీగానే ఉంచారు. తనతో పాటు మిగిలిన 11 మందికి వివిధ శాఖలను కేటాయించారు. సాధారణ పరిపాలన, శాంతి భద్రతలతో పాటు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారు. వీటితో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. కీలకమైన విద్య, వాణిజ్య పన్నులు, స్టాంపులు – రిజిస్ట్రేషన్లు, న్యాయ శాఖలను కూడా ఎవరికీ కేటాయించలేదు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలతో పాటు పశు సంవర్ధక, క్రీడా శాఖలు కూడా కేటాయింపు చేయలేదు.
మంత్రివర్గంలో ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను దృష్టిలో పెట్టుకొని కొన్ని శాఖలను మంత్రులకు కేటాయించలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఖాళీల భర్తీ సమయంలో మిగిలిన ఆన్ని శాఖల కేటాయింపు ఉంటుందని అంటున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవులు వస్తాయని ప్రచారం జరుగుతున్న వారిలో కొందరిని దృష్టిలో ఉంచుకొని కొన్ని శాఖల్ను ఖాళీగా పెట్టినట్లు చెప్తున్నారు.