‘కేంద్రం వైఖరి సరిగా లేదు.. నీతిఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా..’

-

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్రంపై తన నిరసనను వ్యక్తం చేశారు. రేపు దిల్లీలో జరిగే నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేకపోవడం వల్లే తాను ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. లేఖ ద్వారా నేరుగా ప్రధాన మంత్రి మోదీకి తన నిరసనను తెలియజేస్తున్నట్లు చెప్పారు.

దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందని కేసీఆర్ అన్నారు. రూపాయి విలువ పడిపోయిందని.. నిరుద్యోగంతో పాటు ద్రవ్యోల్భణం తీవ్రంగా పెరిగిపోయిందని తెలిపారు. ఇలాంటి అంశాలపై కేంద్రం చర్చించడం లేదని మండిపడ్డారు. దేశంలో నీతి ఆయోగ్ అనేది నిరర్ధక సంస్థగా మారిపోయిందని సీఎం ఆరోపించారు. నీతి ఆయోగ్ లో మేథోమథనం జరగడం లేదని అభిప్రాయపడ్డారు. అదో భజన బృందంగా మారిపోయిందని విమర్శించారు.

రాష్ట్రాలపై కేంద్రం విధానాలు సరిగ్గా లేవని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇటీవల రాష్ట్రాలు చేసే అప్పులపై కేంద్రం కొత్త నిబంధన తీసుకొచ్చిందని.. దాని వల్ల అభివృద్ధి చెందుతోన్న తెలంగాణకు బ్రేక్ పడుతోందని చెప్పారు. మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్ల గ్రాంట్ ఇవ్వాలని.. మిషన్ భగీరథకు రూ.19,500 కోట్ల గ్రాంట్ ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని గుర్తుచేశారు. వీటిని పూర్తి చేసినా.. కేంద్రం ఇప్పటి వరకు నిధులు ఇవ్వలేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ విధానాలు సరిగ్గా లేకపోవడం వల్లే రేపు దిల్లీలో జరిగే సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు.

“కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. కేంద్ర విధానాలతో దేశంలో రైతాంగం బాగా దెబ్బతింది. దేశ ప్రజల్లో ద్వేషం, అసహనం పెరిగిపోతున్నాయి. 8 ఏళ్లలో నీతి ఆయోగ్ సాధించిందేమీ లేదు. 13 నెలల తర్వాత రైతు చట్టాలను కేంద్రం రద్దు చేసింది. 13 రోజుల్లోనే ఈ చట్టాలను రద్దు చేసి ఉండాల్సింది. దేశంలో మత సామరస్యం దెబ్బతినేలా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారు.”    – కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

Read more RELATED
Recommended to you

Latest news