హైదరాబాద్ః తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేటలో ఆకస్మిక పర్యటనకు వెళ్లారు. దీనిలో భాగంగా ఒంటిమామిడి వ్యవసాయ, కూరగాయల మార్కెట్ కమిటీలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అక్కడ జరుగుతున్న పనులు, అధికారుల పనితీరు, రైతుల పరిస్థితులు గురించి ఆరా తీశారు. ఈ క్రమంలోనే అక్కడి రైతులతో కేసీఆర్ మాట్లాడారు. పంటల సాగు, పెట్టుబడి వ్యయం, దిగుబడులు, మార్కెటింగ్ సౌకర్యం, బహిరంగ మర్కెట్లో కూరగాయల ధరల, రైతు సమస్యలు సహా పలు విషయాలు రైతులను అడిగి తెలుసుకున్నారు.
ఆధునికత నేపథ్యంలో వచ్చిన టెక్నాలజీని వ్యవసాయంలో ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు. అలాగే, మార్కెట్లో అధికంగా డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే మంచి ధర లభిస్తుందనీ, రైతులకు మేలు జరుగుతుందని కేసీఆర్ అన్నారు. రైతుల నుంచి ఏజెంట్లు తీసుకునే కమీషన్ 4శాతం కంటే అధికంగా ఉండకూడదనీ, రైతులు మార్కెట్లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవవాలని ఆదేశించారు.
అలాగే, స్థానికంగా కూరగాలను నిల్వ చేయడానికి కోల్డ్ స్టోరేజీ నిర్మాణం, సహా ప్రాథమిక మౌళిక సదుపాయాలు కల్పించడానికి వీలుగా ఉంటే 50 ఏకరాల స్థలాన్ని గుర్తించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఒంటిమామిడి మార్కెట్‌ను మరో 14 ఎకరాలకు విస్తరిస్తామని తెలిపారు.