తెలంగాణలో 15 ఎంపీ స్థానాల్లో గెలుపై లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తూ.. అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలు వివరిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఛార్జ్షీట్ విడుదల చేయనుంది. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రానికి చేసేంది ఏంటని శూన్యమని చెప్పేందుకే ఈ ఛార్జ్షీట్ విడుదల చేస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో బీజేపీపై కాంగ్రెస్ ఛార్జ్‌షీట్ విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్డ్ దీపాదాస్ మున్షీ పాల్గొననున్నారు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.