తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. జూన్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మూడురోజుల పాటు వేడుకలు నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ సూచించారు. ఈ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ రాష్ట్ర ప్రజలకు గులాబీ దళపతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకల సందర్భంగా శనివారం సాయంత్రం అమరవీరుల స్తూపం నుంచి అమరజ్యోతి వరకు బీఆర్ఎస్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. అనంతరం అమరులకు నివాళులు అర్పించారు. నేడు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కేసీఆర్ అధ్యక్షతన వేడుకల సభ నిర్వహించనున్నారు. ఈ సభలో గులాబీ బాస్ కేసీఆర్ ప్రసంగించనున్నారు. మరోవైపు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అనంతరం అక్కడే ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహిస్తారు. తెలంగాణ ఉద్యమం, పదేళ్ల అభివృద్ధి, సంక్షేమం వివరించేలా ఫొటో ఎగ్జిబిషన్ ఉండనుంది. ఇక రేపు అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో దశాబ్ది ముగింపు వేడుకలు జరపనున్నారు.