కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త.. పదవీ విరమణపై కీలక ప్రకటన

 

కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసే కాంట్రాక్టు అధ్యాపకుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీచేశారు. ఇకపై వారికి వేతనాలను డ్రా చేసి ఇచ్చే అధికారాన్ని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు అప్పగిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

బయోమెట్రిక్ ఆధారిత హాజరు మేరకు వారికి వేతనాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటివరకు జీతాల చెల్లింపు అధికారం ఇంటర్ విద్యాశాఖ అధికారులకు ఉండేది. దానివల్ల జిల్లాలోని ఏ ఒక్క కళాశాల నుంచి వివరాలు అందకపోయినా మిగిలిన వారికి వేతనాలు చెల్లింపుల్లో జాప్యం జరిగేది. ఇకపై ఆ సమస్య ఉండదని కాంట్రాక్ట్ అధ్యాపక సంఘం నేతలు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 404 కళాశాలల్లో 3,541 మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు.