తెలంగాణ ప్రజలకు గవర్నర్, సీఎం విజయదశమి శుభాకాంక్షలు

విజయదశమి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై.. నవరాత్రి పండుగ ప్రజలందరిలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి విజయం దసరా ముఖ్య సందేశమని, ఇది ఎల్లకాలం వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని కోరుకున్నారు.

తెలంగాణ స్ఫూర్తితో దేశం ప్రగతిబాటలో నడవాలని.. విజయానికి సంకేతమైన దసరా రోజు తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలని సీఎం కేసీఆర్​ ప్రార్థించారు. ధర్మస్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయదశమిగా దసరాను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. పాలపిట్టను దర్శించి పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేసే సాంప్రదాయం గొప్పదని పేర్కొన్నారు.

అలయ్‌ బలయ్‌ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం దసరా పండుగ ప్రత్యేకత అని సీఎం కేసీఆర్‌ అన్నారు. అనతి కాలంలోనే అభివృద్ధి సాధించి రాష్ట్రాన్ని ముందంజలో నిలిపిన తెలంగాణ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని వివరించారు. విజయదశమి స్ఫూర్తిని కొనసాగిస్తామన్న కేసీఆర్‌.. ప్రజలందరూ సుఖశాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షించారు