The Ghost Movie Review: నాగార్జున ది ఘోస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

-

అక్కినేని నాగార్జున కెరీర్​లోనే ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘శివ’. ఈ సినిమా రిలీజ్ డేట్ అంటే అక్టోబర్ 5న ‘ది ఘోస్ట్’ మూవీ వస్తోంది. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్ నిర్మించారు. ఈ యేడాది ఇప్పటికే ‘బంగార్రాజు, బ్రహ్మాస్త్రం’ చిత్రాలతో జనం ముందుకు వచ్చిన నాగార్జున ‘ది ఘోస్ట్’తో ఎలా ఆకట్టుకున్నారో చూద్దాం.

కథ ఏంటంటే… ఇంటర్ పోల్ ఆఫీసర్స్ విక్రమ్ (నాగార్జున), ప్రియ (సోనాల్ చౌహాన్) మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంటుంది. ఈస్ట్ అరేబియాలో ఓ ఆపరేషన్ ను వీళ్ళిద్దరూ సక్సెస్ చేస్తారు. లివ్ ఇన్ రిలేషన్​లో ఉండే వీరిద్దరూ చేపట్టిన మరో ఆపరేషన్ మాత్రం ఫెయిల్ అవుతుంది. ఇండియన్ ఫ్యామిలీకి చెందిన ఓ పిల్లాడిని ఉగ్రవాదులు దారుణంగా చంపేస్తారు. అప్పటికే మానసికంగా డిస్ట్రబ్ అయి ఉన్న విక్రమ్ ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. అతను తన మాట వినడం లేదనే కోపంతో ప్రియా ముంబయికు వచ్చి ఎన్.సి.బి.లో చేరుతుంది. ఇలా ఐదేళ్లు గడిచిపోతాయి. ఆ తర్వాత ఓ రోజు ఇండియా నుండి విక్రమ్​కు అను (గుల్ పనాగ్) నుండి ఫోన్ వస్తుంది. తన లైఫ్ రిస్క్​లో ఉందని, తన కూతుర్ని చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని విక్రమ్​కు చెప్పి వాపోతుంది. దాంతో హుటాహుటిన విక్రమ్ ఊటీలో లాండ్ అవుతాడు. అనుకు అండగా నిలబడటంతో పాటు ఆమె కూతురి సెక్యూరిటీ బాధ్యతలను భుజానికెత్తుకుంటాడు. అసలు విక్రమ్​కు అనుకు ఉన్న సంబంధం ఏమిటీ? ఆమె కోసం అతను తన లైఫ్​ను ఎందుకు రిస్క్​లో పెట్టుకున్నాడు? కార్పొరేట్ సంస్థలు అండర్ వరల్డ్​తో చేతులు కలిపితే జరిగే పర్యవసానం ఏమిటీ? ఐదేళ్ళ పాటు విక్రమ్​కు దూరంగా ఉన్న ప్రియా మళ్ళీ అతని చెంతకు ఎలా చేరింది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


ఎలా ఉందంటే… ముందు చెప్పినట్టు నాగార్జునకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ‘ఆఫీసర్’తో పాటు తాజాగా ‘వైల్డ్ డాగ్’లోనూ నటించాడు. అయితే ఆ రెండు సినిమాల కంటే కూడా ఇది కాస్తంత భిన్నమైంది. ఇందులో కేవలం యాక్షన్​కే ప్రాధాన్యం ఇవ్వకుండా కొద్దిగా రొమాన్స్​ను, ఇంకొద్దిగా ఫ్యామిలీ సెంటిమెంట్​ను డైరెక్టర్ ప్రవీణ్‌ సత్తారు మిక్స్ చేశాడు. అండర్ వరల్డ్ నేపథ్యాన్ని మాత్రమే తీసుకుని ఉంటే ఇది రొటీన్ యాక్షన్ థ్రిల్లర్ అయిపోయి ఉండేది. అయితే కార్పొరేట్ క్రైమ్​ను దానికి యాడ్ చేయడం బాగుంది. నిజానికి ఈ రెండు అంశాలను ప్రవీణ్ సత్తారు తన గత రెండు ప్రాజెక్ట్స్​లో విడివిడిగా టచ్ చేశాడు. ఐదేళ్ళ క్రితం ‘గరుడవేగ’ను ఎన్.ఐ.ఎ. నేపథ్యంలో తెరకెక్కించిన ప్రవీణ్ లాస్ట్ ఇయర్ కార్పొరేట్ క్రైమ్ నేపథ్యంలోనే ‘లెవన్త్ అవర్’ వెబ్ సీరిస్ తీశాడు. సో.. ఈ రెండింటినీ మిక్స్ చేసి ఈ ప్రాజెక్ట్ విషయంలో జస్ట్ కేక్ వాక్ చేశాడంతే. అయితే నాగార్జున బాడీ లాంగ్వేజ్​ను దృష్టిలో పెట్టుకుని యాక్షన్ సీన్స్​ను, అక్కినేని అభిమానులను నిరుత్సాహానికి గురి చేయకుండా రొమాంటిక్ సాంగ్​కు ప్రాధాన్యమిచ్చాడు. దాంతో ఇటు ఫ్యాన్స్, అటు మాస్ ఈ సినిమా విషయంలో ఫుల్ హ్యాపీ ఫీలవుతారు. అలానే ఫ్యామిలీ ఆడియెన్స్​ను ఆకట్టుకునేలా సెంటిమెంట్ సీన్స్​ను డిజైన్ చేశాడు. అవీ బాగానే ఉన్నాయి. ఇక చివరలో ఇచ్చిన ట్విస్ట్ అందరినీ సంతోష పరుస్తుంది.

ఎవరు ఎలా చేశారంటే… విక్రమ్ క్యారెక్టర్​లో నాగార్జున చక్కగా సెట్ అయ్యాడు. యాక్షన్ సీన్స్​లోనూ స్టైలిష్​గా కనిపించాడు. విశేషం ఏమంటే, ఇంతకాలం గ్లామర్ డాల్ ఇమేజ్​ని క్యారీ చేస్తున్న సోనాల్ చౌహాన్ ఇందులో దానితో పాటు యాక్షన్ సీన్స్ లోనూ ఆకట్టుకుంది. కార్పొరేట్ సంస్థ అధినేత్రిగా గుల్ పనాగ్, ఆమె కూతురుగా అనిఖా సురేంద్రన్ చక్కగా నటించారు. విలన్ మనీశ్ చౌదరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. భరత్, సౌరభ్ అందించిన రొమాంటిక్ సాంగ్ ట్యూన్ బాగుంది. అలానే మార్క్ కె రాబిన్ నేపథ్య సంగీతం, ముఖేష్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉన్నాయి. దినేశ్ సుబ్బరాయన్, కేచ్ డైరెక్ట్ చేసిన యాక్షన్ సీన్స్ బాగున్నాయి. కానీ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్తంత కేర్ తీసుకుని ఉండాల్సింది. సినిమా అయిపోయిందని భావిస్తున్న తరుణంలో విక్రమ్ భారీ తుపాకీ తీసుకుని విధ్వంసం సృష్టించిన సన్నివేశాలకు ఇటీవల వచ్చిన కమల్ హాసన్ ‘విక్రమ్’ ప్రేరణేమో అనిపిస్తుంది.

ప్లస్, మైనస్ పాయింట్స్… సినిమాలో ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ బాగుంది. సినిమాను స్టైలిష్​గా తెరకెక్కించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. రోటిన్ ఫ్లాష్ బ్యాక్ ఉండటం ఈ సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. ఓపెనింగ్ సీన్స్ వీక్​గా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్​గా చేస్తే బాగుండు అనే ఫీలింగ్ వస్తోంది.

చివరగా…  ది ఘోస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ.. కచ్చితంగా చూడాల్సిన సినిమా. సినిమా ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామా. నాగ్ సహా ఇతర నటీనటులు తమ బెస్ట్ ఇచ్చారు. యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. సో ఈ దసరాకు ఫ్యామిలీతో ఓసారి వెళ్లి చూడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news