సీజనల్ వ్యాధులపై మూడంచెల వ్యూహం – తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను కాపాడేందుకు మూడంచెల విధానం అనుసరించాలని ఆదేశించారు. అవగాహన కల్పించడం,వ్యాధి నిర్ధారణ చేయడం, త్వరితగతిన చికిత్స అందించడం వంటివి చేయాలన్నారు.

సీజనల్ వ్యాధుల పట్ల విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాని, ఈ విషయంలో పంచాయతీ రాజ్ సహా ఇతర శాఖలు, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత బృందంతో ప్రచారం చేయాలన్నారు.

మంగళవారం వెంగలరావు నగర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం నుండి రాష్ట్రంలోని నాలుగు ఐటిడిఏ పరిధిలోని జిల్లాల్లో సీజనల్ వ్యాధులపై మంత్రి హ‌రీశ్ రావు టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…మొన్నటి వరకు ఉన్న ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టి, వాతావరణం పూర్తిగా చల్లబడింది. రాష్ట్రమంతటా వానలు మొదలయ్యాయి. ఒక్కసారిగా వాతావరణం లో జరిగిన మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.