ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ధరణి పోర్టల్ లో సమస్యలున్నాయని చెబుతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పోర్టల్ పైన దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ పై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కన్వీనర్‌తోపాటు నలుగురు సభ్యులను నియమించిన సర్కార్.. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ కన్వీనర్‌గా బాధ్యతలను అప్పగించింది.
రైతుల సమస్యలపై పట్టున్న కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎమ్.కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌గా పని చేసిన రేమండ్ పీటర్‌లకూ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. భూ చట్టాల నిపుణుడు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం అనుబంధ ఆచార్యుడు సునీల్, రెవెన్యూ చట్టాలపై అవగాహన ఉన్న విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి.మధుసూదన్‌లను కూడా కమిటీలో సభ్యుడిగా స్థానం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరుకు పోయిన పలు రకాల భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిపుణులతో సమీక్షలు నిర్వహించింది.