టీఎస్పీఎస్సీ త్వరలోనే గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబరు మొదటివారం నుంచి ఫలితాలను వెల్లడించేలా కసరత్తు ప్రారంభించింది. న్యాయవివాద అడ్డంకుల్లేని నోటిఫికేషన్లకు వారంలోగా ప్రశ్నపత్రాల తుది కీ వెల్లడించి, 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలు ప్రకటించనుంది. అభ్యర్థుల సంఖ్య మేరకు వీలైనంత త్వరగా ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తూ, వరుసగా ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికలు రెడీ చేస్తోంది.
గ్రూప్-1 ప్రిలిమినరీ తుదికీ ఇచ్చిన 15 రోజుల్లో ఫలితాలు ప్రకటించాలని కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు కొన్ని న్యాయవివాదాలు అడ్డంకిగా మారాయి. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో రిజర్వేషన్లు అమలు చేయడం (జీవోనం.55)పై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తెలంగాణ స్థానికతపై న్యాయవివాదాలు పెండింగ్‌లో ఉన్నాయి. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష.. ప్రిలిమినరీ కీపై ఇప్పటికే అభ్యంతరాల్ని పరిశీలించిన కమిషన్, తుదికీని సోమ లేదా మంగళవారాల్లో ప్రకటించాలని భావిస్తోంది.