మరికొన్ని రోజుల్లో గ్రూప్-4 పరీక్ష రాబోతోంది. ఇందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్-4 పోస్టులకు జులై 1న నిర్వహించనున్న రాతపరీక్షకు 9.51 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ మేరకు జిల్లాకేంద్రాల్లో అవసరమైన పరీక్ష కేంద్రాలను టీఎస్పీఎస్సీ గుర్తించింది. పరీక్షల్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలు నిర్వహించింది. ఈ పరీక్ష రాసే అభ్యర్థులకు రెండంచెల తనిఖీలు నిర్వహించనున్నారు.
మరోవైపు గ్రూప్-4 పరీక్ష హాల్‌టికెట్లు ఇవాళ్టి నుంచి అందుబాటులో ఉంటాయని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. జులై 1న పేపర్-1 పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులంతా పరీక్ష నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని చెప్పారు. ఈ రాతపరీక్షలో అభ్యర్థుల వేలిముద్రల్ని టీఎస్‌పీఎస్సీ తప్పనిసరి చేయనున్నట్లు తెలిపారు. హాల్‌టికెట్‌తో పాటు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డును పరిశీలిస్తారని వెల్లడించారు.