ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన అనురాగ్ యూనివర్శిటీ అక్రమణలు ఉన్నట్లయితే వాటి తొలగింపును చట్టప్రకారం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వెంకటాపూర్ గ్రామంలోని నాదం చెరువు బఫర్ జోన్‌లో నిర్మాణాలుంటే వాటిని చట్టప్రకారం తొలగించడానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల ఆక్రమణల పేరుతో అధికారులు తమ హక్కుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, అనురాగ్ యూనివర్శిటీ, నీలిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శనివారం హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో విచారణ చేపట్టిన ధర్మాసనం.. నాదం చెరువులో అనురాగ్ యూనివర్శిటీ ఆక్రమణలున్నట్లయితే వాటి తొలగింపునకు చట్ట ప్రకారం చర్యలు చేపడతామన్న ప్రభుత్వ న్యాయవాది హామీని నమోదు చేస్తూ పిటిషన్‌పై విచారణను మూసివేసింది. కోర్టుకు ఇచ్చిన హామీ ప్రకారం అనురాగ్ యూనివర్శిటీ ఆక్రమణల తొలగింపులో చట్ట ప్రకారం నిబంధనలను అనుసరించాలని అధికారును ఆదేశించింది.