రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన టీఎస్‌పీఎస్‌సీ క్వశ్చన్ పేపర్ లీకే కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రస్తుత దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది. కేసును సీబీఐకి ఇవ్వాలని ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. సిట్ దర్యాప్తు కొంతవరకు సంతృప్తిగా ఉందని పేర్కొంది. కానీ దర్యాప్తు వేగంగా జరగడం లేదని అభిప్రాయపడింది. ఈ కేసు తదుపరి విచారణను జూన్5కు వాయిదా వేసింది. జూన్ 5న దర్యాప్తు పురోగతి నివేదిక ఇవ్వాలని సిట్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. దర్యాప్తు ఇంకా ఎంతకాలం చేస్తారని సిట్‌ను ప్రశ్నించింది. క్వశ్చన్ పేపర్లు లీకై నెలన్నర రోజులయినా దర్యాప్తు ఎందుకు పూర్తి కావడం లేదని అడిగింది. దీనికి సమాధానంగా.. ఎఫ్ఎస్ఎల్ నివేదికల కోసం ఎదురు చూస్తామని ఏజీ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందిలో ఎంతమంది లబ్ది పొందారు.. వాళ్లందర్నీ విచారించారా అని ప్రశ్నించగా.. టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రెటరీ, సభ్యుడిని విచారించామని సిట్ తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీల్లో ఒకరి నుంచి అభిప్రాయం తీసుకోవడానికి అనుమతివ్వగలరా అని ప్రభుత్వాన్ని మరోసారి హైకోర్టు అడిగ్గా.. హైదరాబాద్ సీపీ పర్యవేక్షణ లోనే దర్యాప్తు జరుగుతోందని ఏజీ తెలిపారు.