రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ది కోసమే తెలంగాణను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవమానిస్తున్నారు. తెలంగాణ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే.. కానీ రాజకీయ లబ్ది కోసం విమర్శలు చేయడం సరికాదు. తెలంగాణ ముమ్మాటికీ లాభదాయక రాష్ట్రమే అని అక్బరుద్దీన్ తేల్చిచెప్పారు.
శాసనసభలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. రాష్ట్ర అప్పుల కుప్పగా మారిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ వస్తే అంధకారమేనని గతంలో కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక విద్యుత్, తాగునీరు.. అన్నీ వచ్చాయి. అప్పులు పెరిగినా.. అభివృద్ధి కూడా గణనీయంగా జరిగింది. 55 ఏండ్లలో జరగని అభివృద్ధి ఈ పదేండ్ల కాలంలో జరిగింది. రాష్ట్రంలోనే కాదు.. కేంద్రంలోనూ అప్పులు పెరిగాయి. శ్వేతపత్రం విడుదల వెనుక ఉద్దేశం ఏంటో ప్రభుత్వం చెప్పాలి. రాజకీయాల కంటే రాష్ట్ర సమగ్రతను కాపాడటం మన మొదటి కర్తవ్యం అయి ఉండాలి అని అక్బరుద్దీన్ అన్నారు. కేంద్రం రూ. 44,25,347 కోట్ల అప్పు చేసింది.. దాన్ని ఎందకు ప్రశ్నించరు..? అని అక్బరుద్దీన్ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ అప్పులు ఈ పదేండ్లలో 244 శాతం పెరిగాయి. శ్వేతపత్రం అంతా తప్పుల తడకగా ఉంది. శ్వేతపత్రంలో ఆర్బీఐ, కాగ్ రిపోర్టులను మాత్రమే ప్రస్తావించారు.