తెలంగాణ శాసన మండలిలో వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ తుది ఓటర్ల జాబితా ఏప్రిల్ 4వ తేదీన విడుదల కానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను తుది ఓటర్ల జాబితా ప్రకటించే నాటికి పరిష్కరిస్తామని వెల్లడించారు. అర్హులైన ఓటర్లు ఫాం – 18ను భర్తీ చేయాలని సూచించారు.
ఆయా నియోజకవర్గ పరిధిలోని వారై ఉండడంతో పాటు 2023 నవంబరు 1 నాటికి కనీసం మూడేళ్లు ముందుగా పట్టభద్రులై ఉండాలని వికాస్ రాజ్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన పక్షంలో ఆ రికార్డు నకలును ఆయా సంస్థలకు చెందిన గెజిటెడ్ అధికారి ధ్రువీకరించాల్సి ఉంటుందని తెలిపారు. న్యాయవాదులు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, ఇంజినీరింగ్ పట్టభద్రులు రిజిస్టర్ గ్రాడ్యుయేట్స్ కార్డును జత చేయాల్సి ఉంటుందని వివరించారు. దరఖాస్తుదారు అందచేసిన ధ్రువపత్రంపై అనుమానం వస్తే దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి అసలు ధ్రువపత్రాన్ని సరిపోల్చుకోవాలని.. దరఖాస్తుదారులను అధికారులు తమ కార్యాలయాలకు పిలవకూడదని వికాస్‌రాజ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.