రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు, వాగులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లి రహదారులపైకి నీరు చేరుతోంది. మరోవైపు ప్రాజెక్టుల్లోకి భారీ వరద చేరుతోంది. ఇన్నాళ్లూ నీరు లేక వెలవెలలాడిన ప్రాజెక్టులు ఇప్పుడు జలకళతో సందడిగా మారాయి.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రస్తుతం 18వేల262 క్యూసెక్కుల వరద చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం వెయ్యి 91 అడుగులు కాగా ఇప్పటికే 1071.60 అడుగుల వరద నీరు ఉంది. పూర్తి నీటి నిల్వ 90.3 టీఎంసీలకు గాను ప్రస్తుతం 32.274 టీఎంసీలు నిల్వ ఉంది.
మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద నీటి మట్టం 26 అడుగులకు చేరింది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో తాలిపేరు 21 గేట్లు ఎత్తి 49 వేల క్యూసెక్కుల నీరు దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74 అడుగులు కాగా..ప్రస్తుత నీటి మట్టం 71.64 అడుగులకు చేరింది.