బాధితులు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయంలో రాష్ట్ర పోలీసులు మెరుగైన పని తీరును కనబరుస్తూనే ఉన్నారు. గత 13 నెలల కాలంలో 30,049 ఫోన్లను రికవరీ చేయగలిగారు. అలా దేశంలోనే రెండో స్థానంలో నిలిచారు తెలంగాణ పోలీసులు.ఇక మొబైల్ ఫోన్ల రికవరీలో 35,945 ఫోన్లతో కర్ణాటక మొదటి స్థానంలో నిలవగా… 15,426 ఫోన్లతో మహారాష్ట్ర మూడో స్థానంలో, 7,387 ఫోన్లతో ఆంధ్రప్రదేశ్ నాల్గో స్థానంలో నిలిచినట్లు తెలంగాణ సీఐడీ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 780 పోలీస్‌స్టేషన్లలో సీఈఐఆర్ పోర్టల్‌ను సమర్థంగా నిర్వహిస్తుండటంతో మెరుగైన ఫలితాలను సాధించగలిగినట్లు సీఐడీ ఇన్‌ఛార్జి అదనపు డీజీపీ మహేశ్ భగవత్ తెలిపారు. రాష్ట్రంలో సగటున రోజుకు 76 ఫోన్లను రికవరీ చేయగలిగినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ డా.లావణ్య ఎన్‌జేపీ బృందాన్ని, సహకరించిన పోలీసులను సీఐడీ ఇన్‌ఛార్జి అదనపు డీజీపీ మహేశ్ భగవత్ అభినందించారు.