Telangana : ఆరు పేపర్లతో టెన్త్ పరీక్షలు.. ఈ ఏడాది నుంచే అమలు

-

పదో తరగతి పరీక్షల విధానంలో తెలంగాణ విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. ఇక నుంచి పదో తరగతి బోర్డు పరీక్షలు ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు ఆ శాఖ సంచాలకులు శ్రీదేవసేన తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లాల డీఈవోలు, విద్యా శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. 9, 10వ తరగతుల విద్యార్థులకు నిర్వహించే సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌-2(ఎస్‌ఏ-2) పరీక్షలు కూడా 6 పేపర్లతోనే నిర్వహించాలని  ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

11 పేపర్లు రాయడం వల్ల విద్యార్థులపై భారం పడుతోందని.. 6 పేపర్లకు కుదించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ(ఎస్‌సీఈఆర్‌టీ) విద్యా శాఖ ముందు ప్రతిపాదనలు ఉంచింది. ఎస్‌సీఈఆర్‌టీ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన విద్యా శాఖ ఆరు పేపర్లకు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సామాన్య శాస్త్రం పరీక్షలో భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరు సమాధాన పత్రాలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇప్పటి వరకు పదో తరగతిలో 11పేపర్లతో పరీక్షలు నిర్వహించారు. ద్వితీయ భాష మినహా ప్రథమ, తృతీయ భాష, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాలు రెండు పేపర్లుగా విద్యార్థులు రాస్తున్నారు. కొవిడ్ పరిస్థితుల వల్ల పూర్తిస్థాయి బోధన జరగకపోవడంతో గతేడాది ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news