ఈ నెల 13న పోలింగ్ జరిగిన మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. గత ఎన్నికలలో ఒకే రౌండ్లో లెక్కింపు పూర్తయ్యిందని.. ఈ సారి కూడా ఓకే రౌండ్లో పూర్తి కాకపోతే రెండో రౌండ్ లెక్కింపు చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లను చేశామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. మూడు షిప్టుల్లో కూడా ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. గరిష్ట పారదర్శకత ఉండేలా కౌంటింగ్ సిబ్బందికి సీటింగ్ ఏర్పాట్లు చేశామని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలో పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు సీఈవో వివరించారు. ఎన్నికల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షిస్తున్న సీఈఓ.. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్ల నుంచి.. వినియోగిస్తున్న సాంకేతికత వరకు ప్రతి అంశాన్ని వికాస్ రాజ్ క్షుణ్ణంగా పరిశీలించారు.