దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ మరోసారి ఈడీ ఎదుట హాజరుకానున్నారు. గత నెల 11న కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆరోజు దాదాపు 8 గంటల పాటు ఆమెను అధికారులు విచారించారు. అనంతరం ఈనెల 16న మళ్లీ విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చిన నేపథ్యంలో ఆమె ఇవాళ ఈడీ ముందుకు వెళ్లనున్నారు.
అయితే ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు వాదనలు వినిపించిన కవిత తరపున న్యాయవాదులు.. చట్ట విరుద్ధంగా మహిళను ఈడీ కార్యాలయానికి విచారణకు పిలిచారని వివరించారు. నోటీసులో ఇతరులతో కలిపి విచారిస్తామన్నారనీ.. కానీ అలా చేయలేదని ప్రస్తావించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తన మొబైల్ ఫోన్ సీజ్ చేశారని ధర్మాసనానికి తెలిపారు.
ఈడీ విచారణపై కవిత తరుపు న్యాయవాదులు మధ్యంతర ఉత్తర్వులు కోరగా ధర్మాసనం నిరాకరించింది. ఇవాళ మరోసారి ఈడీ విచారణకు కవిత హాజరు కానున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు మౌనం వహించింది. పిటిషన్పై వెంటనే విచారణ చేపట్టేందుకు కూడా నిరాకరిస్తూ.. ఈనెల 24న వాదనలు వింటామని స్పష్టం చేసింది.