తెలుగు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 18న అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎండలు ముదురుతున్న సమయంలో వర్షాలు కురుస్తున్నందున ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని తెలిపింది.
పశ్చిమ బెంగాల్ నుంచి ఝార్ఖండ్ మీదుగా ఒడిశా వరకు ద్రోణి ఏర్పడింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకూ మరో ద్రోణి ఉంది. ఈ ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రం వైపు తేమ గాలులు వీస్తున్నాయి. ఏపీతో పాటు తెలంగాణ వైపు వీటి ప్రభావం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది.
ఈ నేపథ్యంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, డా.అంబేడ్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఈ నెల 18న అనేక చోట్ల భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది.