తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈ పరీక్షకు దరఖాస్తుల గడువును పెంచారు. ఈ నెల 20వ తేదీ వరకు గడువు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల 20 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 9వ తేదీ వరకు 1.93 లక్షల మంది టెట్కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొదట ఇవాళ్టితోనే గడువు ముగియనుండటంతో దరఖాస్తుల సంఖ్య 2 లక్షలకు మించదని అధికారులు అంచనా వేశారు.
కానీ మరో పది రోజులు గడువు పెంచడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబరులో నిర్వహించిన ఈ పరీక్షకు 2.91 లక్షల మంది దరఖాస్తు చేశారు. దీంతో పోలిస్తే ఈసారి దాదాపు 91 వేల దరఖాస్తులు తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉపాధ్యాయ కొలువు ఎంపికలకు నిర్వహించే డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో కొత్తగా డీఈడీ, బీఈడీ పాసైన అభ్యర్థులతోపాటు గతంలో టెట్ పాసైన వారు సైతం మార్కులు పెంచుకునేందుకు ఈ పరీక్ష నిర్వహించిన ప్రతిసారీ రాస్తుంటారు. ఈసారి మాత్రం ఫీజు పెంచడం వల్ల అభ్యర్థుల సంఖ్య భారీగా పడిపోయింది.