దాదాపు నెలరోజుల తర్వాత వర్షం మళ్లీ రాష్ట్రానికి తిరిగి వచ్చింది. ఆదివారం రోజున రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఇక ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా పలు చోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏకధాటిగా వాన పడుతోంది. ఉదయం 3 గంటల నుంచి కురుస్తున్న వర్షంతో ఇందల్వాయి, డిచ్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక సిరికొండ మండలంలోని చీమనుపల్లిలో 113 మి.మీ. వర్షపాతం నమోదైంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలోనూ భారీగా వాన పడుతోంది. పట్టణంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. ఉదయం పూట పనులకు బయటకు వెళ్లే వారంతా ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, ప్రగతినగర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఉదయం పూట పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, ఇతర పనులపై బయటకు వెళ్లే వారంతా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది వానలో తడుస్తూనే తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.