హైదరాబాద్ మహానగరంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి వర్షం దంచికొడుతోంది. భారీ వర్షాలకు నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మరో గంటపాటు కుండపోత వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలెవరూ ఈ గంటపాటు బయటకు రావొద్దని సూచించింది.
వాతావరణ శాఖ హెచ్చరికతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ సూచించారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేస్తున్నందున మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు భారీ వర్షాల వేళ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ సూచించింది. వర్షాల వేళ పాటించాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సూచనలు చేసింది. అవేంటంటే..?
- వర్షం కురుస్తున్నప్పుడు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకండి
- నీటి ప్రవాహంతో ఉన్న కాలువలు, కల్వర్టులు దాటే ప్రయత్నం చేయకండి
- విద్యుత్ స్తంభాలు, పడిపోయిన విద్యుత్ లైన్లకు దూరంగా ఉండకండి
- చెట్ల కింద, పాత గోడలకు పక్కన ఉండకండి
- కొత్త దారిలో పోకుండా.. ఎప్పుడు వెళ్లే దారిని మాత్రమే ఉపయోగించండి
- పిల్లలను ఆడుకోవడానికి వర్షపు నీటిలోకి గానీ.. వరద సమీపంలోకి పంపకండి
- అత్యవసర సమయాల్లో 100కి డయల్ చేయండి