తెలంగాణలో మరో మూడ్రోజుల పాటు భారీగా వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే గత మూడ్రోజుల నుంచి వరణుడు రాష్ట్రాన్ని వణికిస్తున్నాడు. ముఖ్యంగా భాగ్యనగరాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. ఇవాళ కాస్త శాంతించడంతో.. ప్రజలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో మూడ్రోజులు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ముఖ్యంగా తెలంగాణ తూర్పు, ఈశాన్య జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.