తెలంగాణకు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి బంగాళాఖాతంలో ఊపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ఊపరితల ద్రోని 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉంది.
ఈ ప్రభావంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి.
మరోవైపు నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ఈదమ్మబండతండాలో ఐదుగురిపై పిడుగు పడింది. వీరిలో ఇద్దరు చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నన్కు, రుక్మిణి మృతిచెందగా, మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం చందారంలో కూడా పిడుగుపాటుకు ఒకరు చనిపోయారు.