తెలంగాణపై వేసవిలోనూ వరణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే వారం నుంచి గ్యాప్ ఇస్తూ మరి వడగండ్ల వానతో కడగండ్లు మిగిలుస్తున్న వర్షం.. మరోసారి రాష్ట్రంపై విరుచుకుపడేందుకు రెడీగా ఉంది. రాష్ట్రంలో రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఇవాళ గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో.. రేపు, ఎల్లుండి గంటకు 40 నుంచి 50 కీమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో రాగల 5 రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 30 డిగ్రీల కన్నా తక్కువ నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
గత వారం నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటికే రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. చాలా మంది రైతులు వరి పైరు కింద పడటంతో నష్టపోగా.. మరికొందరు చేతికొచ్చిన ధాన్యం నీటిపాలవ్వడంతో లబోదిబోమంటున్నారు. ఇక మొక్కజొన్న, మామిడి, నిమ్మ వంటి పంటలు నేలరాలి అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చింది.