తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో చాలా వరకు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇక తెల్లవారుజాము సంగతి చెప్పక్కర్లేదు. రాబోయే మూడు రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం రోజున మల్కాజిగిరి, రామచంద్రాపురం, పటాన్‌చెరులో అత్యల్పంగా 14.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవ్వగా.. రాజేంద్రనగర్‌లో 14.5గా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ్టి నుంచి రాగల మూడ్రోజుల పాటు పలు ప్రాంతాల్లో 13 నుంచి 14 డిగ్రీలకు పడిపోయే అవకాశాలున్నాయని వెల్లడించారు. ఉదయం పూట కురుస్తున్న మంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పొగమంచు కారణంగా రహదారులు కనిపించక వాహనదారులు తిప్పలు పడుతున్నారు. పొగ మంచుతో ఉదయం 9 గంటల వరకు పలు ప్రాంతాల్లో అర కిలోమీటర్ దూరంలోని ప్రాంతాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు ఉదయం వేళ మరింత జాగ్రత్తగా ఉండాలని రవాణా శాఖ అధికారులు సూచించారు.