ప్రభుత్వ కార్యాలయాల్లో పత్రాల మాయంపై దర్యాప్తు ముమ్మరం

-

హైదరాబాద్​లోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయం అవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటన జరిగిన ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీని సేకరిస్తున్నారు. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని ఈ కార్యాలయంలోకి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఓఎస్డీ కల్యాణ్‌ అక్రమంగా వెళ్లి పత్రాలు తీసుకెళ్లారని శనివారం రోజున నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మరోవైపు అదేరోజు రాత్రి సాంకేతిక విద్యామండలి కార్యాలయం నుంచి ఇద్దరు వ్యక్తులు దస్త్రాలు తీసుకెళ్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇలా ప్రభుత్వ కార్యాలయాల నుంచి కీలక దస్త్రాలు మాయమవుతున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవ్వడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

ఈ నేపథ్యంలో ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు కీలక ఆధారాలు సేకరించి ముందస్తు ప్రణాళిక ప్రకారమే చేసినట్లుగా అంచనాకు వచ్చారు. మాసబ్‌ట్యాంక్‌, మల్లేపల్లి, ఎన్‌ఎండీసీ, బంజారాహిల్స్‌ మార్గాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరిస్తూ ఈ కేసుల్లో పలువురు అనుమానితులు/నిందితులను ఇవాళ ప్రశ్నించనున్నారు. వరుస ఘటనల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక దస్త్రాలు, పత్రాల స్థితిగతులపై ఆయా శాఖల ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news