తెలంగాణ ప్రజలను చలి వణికిస్తోంది. ఈ ఏడాది కాస్త ఆలస్యంగా మొదలైనా.. ఈనెల మొదటి వారం నుంచి మాత్రం ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పడిపోతున్నాయి. సాయంత్రం అయిందంటే చాలు చేతులు బిగుసుకుపోతున్నాయి. బయట అడుగుపెడదామంటే వణుకు పుడుతోంది. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ క్రమంలో ఆ సమయంలో ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు మెదక్‌లో అత్యల్పంగా 14.3, పటాన్‌చెరులో 14.6… అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 21.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలోనూ గత రెండు రోజులతో పోల్చితే ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయని చెప్పారు. దీంతో ఉదయం పూట పొగమంచు ఏర్పడుతోందని వివరించారు. మరోవైపు పగటి వేళ స్వల్పంగా తగ్గాయని.. శనివారం ఖమ్మంలో మాత్రమే సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా 32.4 డిగ్రీలు నమోదయిందని తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువగానే నమోదైనట్లు పేర్కొన్నారు.