మొన్నటి దాకా చలి పులి పంజా విసిరిన తెలంగాణలో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఫిబ్రవరి నెల మొదటి వారంలోనే ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇలాగే ఉంటే మార్చి నెలలో మరింత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.
కొద్ది రోజులుగా అన్ని జిల్లాల్లో పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయిదు రోజుల నుంచి ఖమ్మంలో సాధారణం కన్నా 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత ఉంటోందని చెప్పారు. హైదరాబాద్‌లోనూ 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించారు.
మహబూబ్‌నగర్, మెదక్, భద్రాచలం, హనుమకొండ ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. గాలిలో తేమ శాతం తగ్గిపోతుండటమే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు ప్రారంభమయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, రామగుండంలలో సాధారణం(14 డిగ్రీలు) కన్నా 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాం ఉందని వెల్లడించారు.