డిపోలు ప్రైవేట్‌పరమంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు అని టీజీఎస్‌ఆర్టీసీ పేర్కొంది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొందరు చేస్తోన్న ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి సంస్థ తీసుకువస్తోందని పేర్కొంది. డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో సహా అన్ని బస్సుల ఆపరేషన్స్ నిర్వహణ పూర్తిగా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని వెల్లడించింది.
2023 మార్చిలో కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం కింద 500 ఇంటర్ సిటీ బస్సులను టెండర్ ద్వారా జేబీఎం కంపెనీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అందులో 48 ఈ-సూపర్ లగ్జరీ బస్సులు ప్రస్తుతం రాగా.. వాటిలో 35 కరీంనగర్-2 డిపోకు, 13 నిజామాబాద్-2 డిపోనకు సంస్థ కేటాయించింది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం అవసరమైన చార్జింగ్ స్టేషన్ల నిర్మాణం డిపోల్లో పూర్తి కావస్తుండటంతో.. వాటిని త్వరలోనే ప్రారంభించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది ప్రతి డిపో పరిధిలో రూరల్, అర్బన్, తదితర భిన్నమైన రూట్లు ఉంటాయి. ఎలక్ట్రిక్ బస్సులను అన్ని రూట్లలో తిప్పడం సాధ్యపడదు. ఎలక్ట్రిక్ బస్సులు తిరిగే కిలోమీటర్ల సామర్థ్యాన్ని బట్టి రూట్లను సంస్థ గుర్తిస్తుంది అని టీజీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది.