బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు గురువారం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్నారు. టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలగవద్దనే ఇక్కడికి రాలేదని ఆయన పేర్కొన్నారు. ఘటన జరిగిన 6 రోజుల తర్వాత కూడా ప్రమాదంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంపై హరీష్ రావు మండిపడ్డారు. నేడు తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, బాధిత కుటుంబాలను దాచిపెట్టరని అన్నారు. రెస్క్యూ బృందాలకు, ప్రభుత్వ బృందాలకు మధ్య సమన్వయం లేదని వెల్లడించారు.
మంత్రులు రోజూ హెలికాప్టర్లో వస్తున్నారు పోతున్నారని, అదేమన్నా టూరిస్ట్ స్పాట్ అనుకున్నారా అని హరీష్ రావు మండిపడ్డారు.ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పని చేయడం లేదని, ప్రమాదం జరిగిన ఇన్నిరోజుల తర్వాత తట్టెడు మట్టి మాత్రమే బయటకు తెచ్చారని.. హడావుడి చేయడం తప్ప ఏమీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది ప్రాణాలపై ప్రభుత్వ చిత్తశుద్ధి ఇదేనా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా శిథిలాల తొలగింపు పనుల్లో వేగం పెంచాలని, నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా సీఎం రేవంత్ రెడ్డికి ఇక్కడికి వచ్చేందుకు టైమ్ దొరకడం లేదు. కానీ ఎన్నికల ప్రచారానికి, ఢిల్లీ టూర్లకు మాత్రం ఆయనకు టైమ్ దొరుకుతుందన్నారు.