వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 2014కి ముందు ఉన్న దుర్భర పరిస్థితులు వచ్చాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఎక్కడ చూసినా రైతాంగం కరువుతో అల్లాడిపోతోందని మండిపడ్డారు. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫిరాయింపులపై ఉన్న ఆసక్తి రైతుల సమస్యలు తీర్చడంలో లేదని విమర్శించారు. కేసీఆర్ను భయపెట్టే మొగోడు ఇంకా పుట్టలేదని.. కాంగ్రెస్ నేతల ఉడత బెదిరింపులకు ఆయన భయపడే రకం కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఆల్రేడీ వ్యతిరేకత మొదలైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తమ సత్తా చూపిస్తారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోసపోయిన ప్రజలు.. తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి బుద్ధి చెబుతారని అన్నారు.