వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువలను ప్రతి ఏడాదీ పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందుకు రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ కు అధికారం కల్పించింది. దీనికి కావాల్సిన ఉత్తర్వులను కూడా సోమవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కాగ గతంలో రిజిస్ట్రేషన్ శాఖ ప్రతి రెండు ఏళ్లకు ఒక్క సారి భూముల మార్కెట్ విలువను పెంచేది. కానీ తాజా గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ప్రతి ఏడాది భూముల మార్కెట్ విలువను రిజిస్ట్రేషన్ శాఖ పెంచనుంది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా లోకి దాదాపు మూడు వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని భావిస్తుంది. కాగ గతంలో దాదాపు ఏడు సంవత్సరాల నుంచి భూముల మార్కెట్ విలువలను సవరించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం చాలా నష్టపోయిందని ప్రభుత్వం భావించింది. అలాగే గత ఏడాది సవరించిన మార్కెట్ విలువకు బహిరంగ మార్కెట్ లో జరుగుతున్న అమ్మకాలకు చాలా తేడా ఉందని గ్రహించారు. అలాగే భూముల విలువ కూడా బహిరంగ మార్కెట్ లో ప్రతి ఏడాది మారుతూ ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.