రేపు దళితబంధు రెండో విడత ప్రారంభం

దళిత బంధు పథకం రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ రేపు ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని 162 మంది లబ్ధిదారులకు మురుగు వ్యర్ధాల రవాణా వాహనాలను అందించనున్నారు. రెండో విడతలో భాగంగా నియోజకవర్గానికి 1100 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనుండగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మొదలైంది.

ఇది ఇలా ఉండగా, అంగన్వాడీలకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పీఆర్సీపై కీలక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించే పిఆర్సి లో అంగన్వాడీలను చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సమ్మెలో ఉన్న అంగన్వాడీల మెజారిటీ సమస్యలను తీర్చామని తెలిపారు. మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది అని చెప్పారు. మిగతా డిమాండ్లపై నివేదిక ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ కార్యదర్శిని ఆదేశించినట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు.