సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 04న పుష్ప-2 ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళ మరణించింది. దీంతో అల్లు అర్జున్ ను తాజాగా అరెస్ట్ చేశారు. ఈ ఘటన పై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ.పాల్ తదితర నేతలు స్పందించారు.
తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు. జాతీయ అవార్డు పొందిన నటుడిని దుస్తులు మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా బెడ్ రూమ్ నుంచి అరెస్ట్ చేసి అగౌరవ పరిచారని పేర్కొన్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మరణించడం చాలా దురదృష్టకరమని.. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని పేర్కొన్నారు. పెద్ద ఈవెంట్లకు ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాల్సిందని ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్.