ఉమ్మడి జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టికెట్ తమకే లభిస్తుందని భావించిన వారికి భంగపాటు తప్పలేదు. పాలేరు నుంచి తనకే టికెట్ వస్తుందని చెప్పుకొచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్ ని పొగుడుతూ ప్రకటనలు చేశారు. ఇంతలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల పేరు ప్రకటించడంతో తుమ్మల వర్గం కాస్త కంగుతిన్నట్టయింది. దీంతో కొత్తగూడెం స్థానం విషయంలో వనమా పై కేసు నేపథ్యంలో జలగం వెంకట్రావుకు టికెట్ ఇస్తారని ప్రచారం కొనసాగింది.
అయినప్పటికీ సీనియారిటీ ప్రాతిపదికన వనమాకే టికెట్ కట్టబెడుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తుమ్మల అనుచరులు ఖమ్మంలోని వీసీరెడ్డి ఫంక్షన్ హాల్ లో మంగళవారం భేటీ అయ్యారు. తుమ్మల, జలగం కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నట్టు సమాచారం. ఖమ్మం రాజకీయాలు వేడెక్కాయి. పాలేరు బీఆర్ఎస్ లో అసమ్మతి సెగ ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీకే తుమ్మల అనుచరులు జై కొడుతున్నారు. సమావేశానికి పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి తరలివచ్చారు. తుమ్మలకు టికెట్ ఇవ్వకుండా పార్టీ అన్యాయం చేసిందంటున్నారు తుమ్మల అనుచరులు. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని తుమ్మలపై ఒత్తిడి పెంచే ఆలోచనలో ఆయన అనుచరులున్నారు. వారం రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాలలో తుమ్మల అనుచరులు భారీ ర్యాలీగా హైదరాబాద్ కు వెళ్లి తుమ్మలను కలవనున్నట్టు సమాచారం.