ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రేపు అసెంబ్లీకి సెలవు ప్రకటించగా.. తిరిగి ఈనెల 27న అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ కేబినెట్ ఆగస్టు 01న బేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు మంత్రి మండలి సమావేశం జరుగనుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 02తో ముగియనున్నాయి.
అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టగా.. బడ్జెట్ పై చర్చ జరుగుతోంది. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు ఈ నెల 31న అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 02తో ముగియనుండగా.. ముగింపునకు ఒక్క రోజు ముందే తెలంగాణ కేబినెట్ భేటీ కానుండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ భేటీ కి సంబంధించిన అజెండా ఏంటి అనేది తెలియనప్పటికీ.. జాబ్ క్యాలెండర్, రైతు భరోసా గైడ్ లైన్స్ కి సంబంధించిన టాపిక్స్ పై కేబినెట్ లో చర్చించనున్నట్టు సమాచారం.