తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైద్రాబాద్ లో ఈ రోజు కిలో చికెన్ ధర రూ.300 పైగా పలుకుతోంది. దీనికి ప్రధాన కారణం కోళ్ల ఉత్పత్తి తగ్గడం, అలాగే ఈ వారంలో వర్షాలు పడటం వలన ధరలు పెరిగాయని చెబుతున్నారు.. జూన్ వరకు పరిస్థితి ఇలాగే ఉంటే.. ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. గుడ్డు ధర కూడా ఒక్కోటి రూ.6కి పైనే పలుకుతోంది.
జనవరిలో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. అప్పుడు కిలో రూ. 130 నుంచి రూ. 140 గా ఉంది. ఆ సమయంలో యజమానులకు నష్టాలే మిగిలాయి. ఆ దెబ్బతో కోళ్ల పెంపకాన్ని పూర్తిగా తగ్గించారు. ఏప్రిల్ నెలలో కిలో చికెన్ ధర రూ. 280 గా ఉంది. కానీ, ఇప్పుడు రూ.310 అవ్వడంతో చికెన్ కన్నా గుడ్డు వండుకోవడం బెటర్ అని జనాలు కొనకుండా వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.290 నుంచి రూ.310 గా ఉంది. స్కిన్ తో అయితే రూ.280 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు. ఇక బోన్ లెస్ చికెన్ రికార్డు స్థాయిలో కిలోకు రూ.520 కు అమ్ముతుండటం గమనార్హం.