ఎన్‌హెచ్‌ఏఐ టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుములు ఈరోజు అర్ధరాత్రి (జూన్ 3వ తేదీ) నుంచి పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ 1వ తేదీన టోల్ రుసుముల ధరలు పెంచుతుండగా.. ఈసారి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశించింది. ఈ నేపథ్యంలో చివరి విడత పోలింగ్ జూన్ 1వ తేదీన ముగియడంతో టోల్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఎన్‌హెచ్‌ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రుసుముల పెంపు సగటున 5 శాతం వరకు ఉంటుందని పేర్కొంది. పెంచిన ధరలు 2025 మార్చి 31వ తేదీ వరకు అమలులో ఉంటాయని వెల్లడించింది.
కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5, ఇరువైపులా కలిపి రూ.10, తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒక వైపు ప్రయాణానికి రూ.10, ఇరువైపులా కలిపి రూ.20, బస్సులు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.35, భారీ రవాణా వాహనాలకు ఒక వైపు ప్రయాణానికి రూ.35, ఇరువైపులా కలిపి రూ.50 వరకు పెంచారు. స్థానికుల నెలవారీ పాస్ రూ.330 నుంచి రూ. 340కి పెంచనున్నట్లు సమాచారం.