హైదరాబాద్ పంజాగుట్ట పోలీసు ఠాణా పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఐదు, ఆరు అంతస్తులకు వ్యాపించాయి. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఆరో అంతస్తులో ఓ కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. గమనించిన స్థఆనికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఆరో అంతస్తులో మంటలు తీవ్రంగా చెలరేగడంతో ఆ కుటుంబం సాయం కోసం ఆ ఇంట్లో ఆర్తనాదాలు చేసింది. అప్పుడే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వారిని కాపాడేందుకు రంగంలోకి దిగారు.
ఓవైపు మంటలు ఆర్పుతూనే అపార్ట్మెంట్ వాసులను సురక్షితంగా బయటకు తరలించారు. అయితే ఆరో అంతస్తులో చిక్కుకున్న కుటుంబాన్ని పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్‌కుమార్ ప్రాణాలకు తెగించి బాధితులను క్షేమంగా బయటకు తెచ్చారు. మరోవైపు రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పేశారు. ప్రాణాలకు తెగించి తమను కాపాడిని కానిస్టేబుల్ శ్రవణ్ను ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రవణ్ తెగింపును అపార్ట్మెంట్ వాసులు కొనియాడారు. మరోవైపు ఈ ఘటనకు షార్ట్ సర్క్యూటే కారణమని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెల్లడించారు.