కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మీ పథకం, ఆరోగ్యశ్రీ హామీలను అమలు చేస్తున్న సర్కార్ త్వరలోనే మరో రెండు గ్యారంటీలకు శ్రీకారం చుట్టనుంది. అయితే ఈ రెండు గ్యారంటీ పథకాల అమలును సీఎం రేవంత్ రెడ్డి కేస్లాపూర్ నాగోబా ఆలయం నుంచి ప్రారంభిస్తారని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్, ఇంద్రవెల్లిల్లో సీఎం పర్యటన స్థలాలను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కలెక్టర్ రాహుల్‌రాజ్, జిల్లా అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి 2వ తేదీన కేస్లాపూర్‌లో పొదుపు సంఘాల మహిళలతో మాట్లాడతారని మంత్రి సీతక్క తెలిపారు. అనంతరం అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని మంత్రి సీతక్క వెల్లడించారు. అనంతరం రెండు గ్యారంటీల అమలును ప్రారంభించి.. వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపం నుంచి రేవంత్ రెడ్డి శ్రీకారం చుడతారని చెప్పారు.