తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదిలాబాద్ జిల్లాలో కొత్తగా సత్నాల, బోరజ్ మండలాలను ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. జైనథ్, అదిలాబాద్ గ్రామీణం, బేల మండలాల నుంచి 18 గ్రామాలను వేరు చేస్తూ సత్నాల పేరుతో కొత్త మండలం ఏర్పాటు చేశారు.
జైనథ్ మండలం నుంచి 28 గ్రామాలను వేరు చేస్తూ బోరజ్ కేంద్రంగా మరో మండలాన్ని ఏర్పాటు చేశారు. 15 రోజుల్లోగా తుది నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇది ఇలా ఉండగా, రెండో విడత గొర్రెల పంపిణీనీ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేదా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలనుకుంటుంది. ఇప్పటికే రూ. 121 కోట్లను ప్రభుత్వం విడుదల చేయడంతో రెండో విడతలో ఇప్పటివరకు 8,801 యూనిట్లను పంపిణీ చేసింది. మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉండటంతో పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిధులు రాగానే గొర్రెల పంపిణీ చేపట్టనుంది.