కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల ఆయన ఖమ్మం లోక్‌సభ టికెట్‌ను ఆశించారు. అయితే టికెట్ తనకు దక్కే అవకాశం లేదని సమాచారం అందడంతో వీహెచ్ అలకబూనారు. ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఇటీవల ఆయన సొంత పార్టీపైనే బహిరంగంగా విమర్శలు చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్‌తో మాట్లాడారు. మహేశ్ కుమార్ వీహెచ్ను బుజ్జగించి ఇవాళ ఆయణ్ను రేవంత్ వద్దకు తీసుకెళ్లారు. రేవంత్, వీహెచ్లు కాసేపు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. వీహెచ్‌కు అన్నివిధాలా అండగా ఉంటానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఇక వీహెచ్ కూడా ప్రభుత్వానికి పార్టీకి సాయంగా ఉంటానని చెప్పారు. ఎట్టకేలకు వీహెచ్ అలకను రేవంత్ బుజ్జగించినట్లైంది.
మరోవైపు లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణలోని 17 నియోజకవర్గాలకుగాను ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. మిగిలిన 8 మందిని ఇవాళ ఎంపిక చేయనున్నట్లు సమాచారం.