లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగుతున్న సమయంలో ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన ప్రకటన చేశారు. లిక్కర్ స్కామ్‌లో నిజానిజాలను తన భర్త గురువారం (మార్చి 28వ తేదీన) కోర్టులో బయట పెట్టనున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు 250 సార్లకు పైగా సోదాలు జరిపిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు సోదాల్లో నగదు దొరకలేదని, ఆ నగదు ఎక్కడ ఉందో రేపు కేజ్రీవాల్ కోర్టులో చెప్తారని అన్నారు. కేజ్రీవాల్ కోర్టుకు ఆధారాలు కూడా చూపిస్తారని చెప్పారు.
‘నా భర్తను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనకు ఆరోగ్యం సరిగా లేదు. డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. కస్టడీలోనూ ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచే నీటి సమస్యను నివారించాలని రెండు రోజుల క్రితం మంత్రి ఆతిశీకి లేఖ పంపారు. దిల్లీని నాశనం చేయాలని వారు (కేంద్రం) కోరుకుంటున్నారు. ఈ పరిణామాలతో ఆయన ఆందోళనకు గురవుతున్నారు’’ అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.